15, ఫిబ్రవరి 2012, బుధవారం

టెట్ లేకుండానే డీఎస్సీకి అవకాశం?




* ఈసారికే.. వచ్చే టెట్‌లో అర్హత సాధిస్తేనే ఉద్యోగం!
* సర్కారు తాజా యోచన... రేపో మాపో అధికారిక ప్రకటన
* రేపట్నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్షతో (టెట్) సంబంధం లేకుండా డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలనే అభ్యర్థుల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి టెట్‌లో ఉత్తీర్ణులు కాకున్నా.. మే నెలలో నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అవకాశం ఇవ్వడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించింది. అయితే జూన్/జూలైలో మళ్లీ టెట్ నిర్వహిస్తున్నందున.. ఇప్పుడు డీఎస్సీ రాసే అవకాశం ఇచ్చి, ఆ టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నట్లు సమాచారం. డీఎస్సీకి, మోడల్ స్కూల్ పోస్టులకు విద్యాశాఖ ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతుండటంతో సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఒకటీ రెండురోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టెట్‌పై ఆందోళన
జనవరి 8న నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు చాలా తక్కువగా ఉండటంతో అసలు టెట్‌నే రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. డీఎస్సీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నపుడు టెట్ పేరుతో రెండో పరీక్ష నిర్వహించాల్సిన అవసరమే లేదని, రెండింటి సిలబస్‌తో ఒకే పరీక్షగా నిర్వహించాలనే విజ్ఞప్తులు వచ్చాయి. మరోవైపు గత ఏడాది నిర్వహించిన టెట్‌లో కంటే మొన్నటి టెట్‌లో అర్హులైన వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో విద్యాశాఖ నార్మలైజేషన్ పద్ధతిలో అదనపు మార్కులను ఇచ్చి గత ఫలితాలకు సమానంగా ఫలితాలు ఉండేలా చూసింది. అయినా అభ్యర్థుల్లో నమ్మకం కుదరలేదు. ప్రశ్నపత్రాన్ని కావాలనే క్లిష్టంగా ఇచ్చారని, అందువల్లే తామెవరూ అర్హత సాధించలేకపోయామనే ఆందోళన వ్యక్తం చేశారు.

టెట్‌లో అర్హత సాధించకపోయినా మే నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించే డీఎస్సీ రాత పరీక్షకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు మంత్రి పార్థసారథికి విన్నవించుకున్నారు. మంగళవారం కూడా మంత్రిని కలిసి డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి డీఎస్సీకి దరఖాస్తు, పరీక్ష రాసే అవకాశం ఇచ్చి.. జూన్/జూలైలో జరిగే టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలను ఇచ్చే అంశంపై విద్యా శాఖ దృష్టి సారించింది. తద్వారా అభ్యర్థులకు ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తోంది.

సాధ్యాసాధ్యాల పరిశీలన: మంత్రి
అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా.. టెట్ లేకపోయినా ఈసారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించి.. జూన్‌లో జరిగే టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీనిపై బుధవారం స్పష్టత వస్తుందని, సీఎంతోనూ చర్చిస్తామని మంత్రి చెప్పారు.
 
సాక్షి సౌజన్యంతో....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి