15, ఫిబ్రవరి 2012, బుధవారం

టెట్ లేకుండా డీఎస్సీ?



- సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
- అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదేశం
- నిబంధన సడలించే అవకాశం!
- ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం యోచన
- రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన!
- రేపటి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (టీ న్యూస్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వ్యతిరేకిస్తూ డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఫలించనుందా? వారికి టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ రాసే అవకాశం రానుందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టెట్ అర్హత లేకపోయినా డీఎస్సీ రాసే వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి డీ సాంబశివరావుకు మంగళవారం నోట్ పంపారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంవూతితో సంప్రదించి, నోట్ పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలని, టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయి ఇస్తామని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో టెట్‌ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల నుంచి ఒత్తిడి వచ్చింది.

టెట్ సాకుతో డీఎస్సీకి అర్హతలేకుండా చేశారంటూ ఏడాది కాలంగా అభ్యర్థుల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు పునరాలోచనలో పడింది. ఓవైపు.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారమే డీఎస్సీ అర్హతలను, మార్గదర్శకాలను విడుదల చేసినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందువల్ల టెట్ ను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకున్నా గత రెండు టెట్లలో క్వాలీఫైకాని అభ్యర్థులకు ఈసారి డీఎస్సీకి అనుమతించి, జూన్‌లో నిర్వహించే మూడో టెట్‌లో క్వాలీఫై కావాలనే నిబంధన పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్‌ను ఆరు నెలకోసారి నిర్వహించాలి. ఇందులోభాగంగా తొలిసారి 2011 జూలై 31న టెట్ నిర్వహించారు. దీనికి మొత్తం 3,73,644 దరఖాస్తులు రాగా మొదటి పేపర్‌కు 32,20, రెండో పేపర్‌కు 51,296 వచ్చాయి. రెండు పేపర్లలో కలిపి 51 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. ఎన్‌సీటీఈ కొత్త నిబంధనల ప్రకారం ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాగా రెండో టెట్‌ను జనవరి 2012న నిర్వహించారు. ఇందులో రెండు పేపర్లకు కలిపి 4,97,094 మంది హాజరయ్యారు. 2,30,20 మంది (50.42 శాతం) అర్హత సాధించారు. పేపర్-1లో 26,154 మంది, పేపర్-2 (గణితం, సైన్స్)లో 1,10,017 మంది, పేపర్-2 (సోషల్)లో 94,109 మంది అర్హత సాధించారు. డీఎస్సీలో వెయి కారణంగా తొలి టెట్ రాసి క్వాలిఫై అయినవారు మార్కులు పెంచుకునేందుకు రెండో టెట్‌కు రాశారు.

రాష్ట్రం మొత్తం మీద ఉన్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల్లో 31 శాతం మంది మాత్రమే ఈ రెండు టెట్లలో కలిపి అర్హ త సాధించినట్లు అధికారుల అంచనా. దీంతో మెజారిటీ అభ్యర్థుల నుంచి ఆందోళన మొదలైంది. టెట్ వల్ల అభ్యర్థులు నష్టపోయారన్న ఆందోళన నేపథ్యంలో అర్హులైన అందరికీ డీఎస్సీ అవకాశం కల్పించి, జూన్‌లో నిర్వహించే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే నిబంధన పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా డీఎస్సీకి రేపటి నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. సలహాలు, సందేహాలు నివృత్తి కోసం అధికారులు డీఎస్సీ విచారణ సెల్ ఏర్పాటుచేశారు. http://apdsc.cgg. gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి