15, ఫిబ్రవరి 2012, బుధవారం

టెట్ లేకుండానే డీఎస్సీకి అవకాశం?




* ఈసారికే.. వచ్చే టెట్‌లో అర్హత సాధిస్తేనే ఉద్యోగం!
* సర్కారు తాజా యోచన... రేపో మాపో అధికారిక ప్రకటన
* రేపట్నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్షతో (టెట్) సంబంధం లేకుండా డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలనే అభ్యర్థుల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి టెట్‌లో ఉత్తీర్ణులు కాకున్నా.. మే నెలలో నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అవకాశం ఇవ్వడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించింది. అయితే జూన్/జూలైలో మళ్లీ టెట్ నిర్వహిస్తున్నందున.. ఇప్పుడు డీఎస్సీ రాసే అవకాశం ఇచ్చి, ఆ టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నట్లు సమాచారం. డీఎస్సీకి, మోడల్ స్కూల్ పోస్టులకు విద్యాశాఖ ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతుండటంతో సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఒకటీ రెండురోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టెట్‌పై ఆందోళన
జనవరి 8న నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు చాలా తక్కువగా ఉండటంతో అసలు టెట్‌నే రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. డీఎస్సీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నపుడు టెట్ పేరుతో రెండో పరీక్ష నిర్వహించాల్సిన అవసరమే లేదని, రెండింటి సిలబస్‌తో ఒకే పరీక్షగా నిర్వహించాలనే విజ్ఞప్తులు వచ్చాయి. మరోవైపు గత ఏడాది నిర్వహించిన టెట్‌లో కంటే మొన్నటి టెట్‌లో అర్హులైన వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో విద్యాశాఖ నార్మలైజేషన్ పద్ధతిలో అదనపు మార్కులను ఇచ్చి గత ఫలితాలకు సమానంగా ఫలితాలు ఉండేలా చూసింది. అయినా అభ్యర్థుల్లో నమ్మకం కుదరలేదు. ప్రశ్నపత్రాన్ని కావాలనే క్లిష్టంగా ఇచ్చారని, అందువల్లే తామెవరూ అర్హత సాధించలేకపోయామనే ఆందోళన వ్యక్తం చేశారు.

టెట్‌లో అర్హత సాధించకపోయినా మే నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించే డీఎస్సీ రాత పరీక్షకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు మంత్రి పార్థసారథికి విన్నవించుకున్నారు. మంగళవారం కూడా మంత్రిని కలిసి డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి డీఎస్సీకి దరఖాస్తు, పరీక్ష రాసే అవకాశం ఇచ్చి.. జూన్/జూలైలో జరిగే టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలను ఇచ్చే అంశంపై విద్యా శాఖ దృష్టి సారించింది. తద్వారా అభ్యర్థులకు ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తోంది.

సాధ్యాసాధ్యాల పరిశీలన: మంత్రి
అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా.. టెట్ లేకపోయినా ఈసారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించి.. జూన్‌లో జరిగే టెట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీనిపై బుధవారం స్పష్టత వస్తుందని, సీఎంతోనూ చర్చిస్తామని మంత్రి చెప్పారు.
 
సాక్షి సౌజన్యంతో....

టెట్ లేకున్నా డీఎస్సీ

టెట్ లేకున్నా డీఎస్సీ చాన్స్?
రేపోమాపో సర్కారు తుది నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉపాధ్యాయ అర్హతా పరీక్ష(టెట్)లో ఇప్పటి వరకు క్వాలిఫై కాని అభ్యర్థులకూ ఇతర అర్హతలన్నీ ఉంటే డీఎస్సీ-2012కి దరఖాస్తు చేసుకుని రాత పరీక్ష రాసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయుల నుంచి 'టెట్'పై వస్తున్న అభ్యంతరాలపై సర్కారు దృష్టి సారించింది. ఇంతవరకు రెండు సార్లు జరిగిన 'టెట్'లో క్వాలిఫై కాని అభ్యర్థులకు న్యాయం చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

ఈ అంశంపై రేపో, మాపో సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనార్థం జూన్‌లోనే మూడో 'టెట్' నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మొదటి 'టెట్'తో పోలిస్తే రెండో 'టెట్' చాలా కష్టంగా ఉందని, రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి సర్కారుకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందాయి. అయితే రెండు పరీక్షల మధ్య ఉన్న తేడాను తొలగించేందుకు రెండో 'టెట్' రాసిన అభ్యర్థులందరికీ మోడరేషన్ మార్కులు కలిపిన అనంతరం ఫలితాలను ప్రకటించారు. అయినా, వ్యతిరేకత తగ్గలేదు. కాగా బీఎడ్ అభ్యర్థులు తమను సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకూ దరఖాస్తు చేసు కునేందుకు అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో....

టెట్ నుంచి మినహాయింపు

Tags: dsc, డీఎస్సీ, d.s.c., DSC, APDSC, DSC2012, DSC-2012

టెట్ లేకుండా డీఎస్సీ?



- సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
- అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదేశం
- నిబంధన సడలించే అవకాశం!
- ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం యోచన
- రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన!
- రేపటి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (టీ న్యూస్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వ్యతిరేకిస్తూ డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఫలించనుందా? వారికి టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ రాసే అవకాశం రానుందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టెట్ అర్హత లేకపోయినా డీఎస్సీ రాసే వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి డీ సాంబశివరావుకు మంగళవారం నోట్ పంపారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంవూతితో సంప్రదించి, నోట్ పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలని, టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయి ఇస్తామని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో టెట్‌ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల నుంచి ఒత్తిడి వచ్చింది.

టెట్ సాకుతో డీఎస్సీకి అర్హతలేకుండా చేశారంటూ ఏడాది కాలంగా అభ్యర్థుల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు పునరాలోచనలో పడింది. ఓవైపు.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారమే డీఎస్సీ అర్హతలను, మార్గదర్శకాలను విడుదల చేసినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందువల్ల టెట్ ను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకున్నా గత రెండు టెట్లలో క్వాలీఫైకాని అభ్యర్థులకు ఈసారి డీఎస్సీకి అనుమతించి, జూన్‌లో నిర్వహించే మూడో టెట్‌లో క్వాలీఫై కావాలనే నిబంధన పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్‌ను ఆరు నెలకోసారి నిర్వహించాలి. ఇందులోభాగంగా తొలిసారి 2011 జూలై 31న టెట్ నిర్వహించారు. దీనికి మొత్తం 3,73,644 దరఖాస్తులు రాగా మొదటి పేపర్‌కు 32,20, రెండో పేపర్‌కు 51,296 వచ్చాయి. రెండు పేపర్లలో కలిపి 51 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. ఎన్‌సీటీఈ కొత్త నిబంధనల ప్రకారం ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాగా రెండో టెట్‌ను జనవరి 2012న నిర్వహించారు. ఇందులో రెండు పేపర్లకు కలిపి 4,97,094 మంది హాజరయ్యారు. 2,30,20 మంది (50.42 శాతం) అర్హత సాధించారు. పేపర్-1లో 26,154 మంది, పేపర్-2 (గణితం, సైన్స్)లో 1,10,017 మంది, పేపర్-2 (సోషల్)లో 94,109 మంది అర్హత సాధించారు. డీఎస్సీలో వెయి కారణంగా తొలి టెట్ రాసి క్వాలిఫై అయినవారు మార్కులు పెంచుకునేందుకు రెండో టెట్‌కు రాశారు.

రాష్ట్రం మొత్తం మీద ఉన్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల్లో 31 శాతం మంది మాత్రమే ఈ రెండు టెట్లలో కలిపి అర్హ త సాధించినట్లు అధికారుల అంచనా. దీంతో మెజారిటీ అభ్యర్థుల నుంచి ఆందోళన మొదలైంది. టెట్ వల్ల అభ్యర్థులు నష్టపోయారన్న ఆందోళన నేపథ్యంలో అర్హులైన అందరికీ డీఎస్సీ అవకాశం కల్పించి, జూన్‌లో నిర్వహించే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే నిబంధన పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా డీఎస్సీకి రేపటి నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. సలహాలు, సందేహాలు నివృత్తి కోసం అధికారులు డీఎస్సీ విచారణ సెల్ ఏర్పాటుచేశారు. http://apdsc.cgg. gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.